ఇంట్లో కూర్చున్న వారి గురించి కాదు - ఇక్కడ ఉన్నవారికి ఆహ్వానం పలకాలి - అదే ప్రొటోకాల్‌ !

Telugu Lo Computer
0


మైసూర్‌లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈనేపథ్యంలో డీకే తన ప్రసంగం తర్వాత ముఖ్యమైన పనిమీద బెంగళూరుకు బయలుదేరారు. ఆ తర్వాత సీఎం ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ప్రముఖుల గురించి ప్రస్తావించే సమయంలో డిప్యూటీ సీఎం పేరును ప్రస్తావించ లేదు. పార్టీ కార్యకర్త ఒకరు ఈ విషయాన్ని గుర్తుచేయగా సీఎం ఆయనపై మండిపడ్డారు. 'శివకుమార్‌ ఇక్కడ లేరు కదా? దయచేసి వెళ్లి కూర్చొండి. ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారి గురించి కాదు.. వేదికపై ఉన్న నేతల పేర్లను ప్రస్తావించాలి. ఇంట్లో కూర్చున్న వారి గురించి కాదు. ఇక్కడ ఉన్నవారికి ఆహ్వానం పలకాలి. అదే ప్రొటోకాల్‌. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా' అని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. చివరకు సీనియార్టీ, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకొని సిద్ధరామయ్యను హైకమాండ్‌ ఎంచుకుంది. అయితే, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠంలో మార్పు ఉంటుందని అప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీకే, సిద్ధరామయ్య ఇద్దరూ స్పష్టతనిస్తూనే ఉన్నా రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)