పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో మధుమేహ బోర్డులు ఏర్పాటు చేయాలని గతంలో ఆదేశించిన సీబీఎస్‌ఈ బోర్డు తాజాగా మరో కొత్త ఆర్డర్ జారీ చేసింది. తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో 'ఆయిల్ బోర్డులు'ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు పాఠశాలలకు సీబీఎస్‌ఈ డైరెక్టర్ (అకడమిక్) డాక్టర్ ప్రజ్ఞా ఎం.సింగ్ లేఖ రాశారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు ఆహార పదార్థాల్లో నూనెల హానికర వినియోగం గురించి తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని క్యాంటీన్లు, సమావేశ మందిరాలలో వివిధ ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లకు లేఖ రాసిన నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, పెద్దల్లో ఊబకాయం గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నట్టు సీబీఎస్‌ఈ పాఠశాలలకు రాసిన లేఖలో పేర్కొంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 (2019-21) ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో ప్రతి ఐదుగురు పెద్దల్లో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారని తెలిపింది. అలాగే ఊబకాయంపై 2025లో ప్రచురితమైన లాన్సెట్ 'జీబీడీ 2021' అధ్యయనం ప్రకారం దేశంలో అధిక బరువు, ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 2021లో 18 కోట్లు ఉండగా, 2050 నాటికి ఆ సంఖ్య 44.9 కోట్లకు చేరుతుందని అంచనా . పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణం ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వల్లేనని నివేదికలు చెబుతున్నాయని లేఖలో ప్రస్తావించింది. అందువల్ల ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పాఠశాలలు తమ విద్యార్థులు, సిబ్బందికి వీటిపై అవగాహన కల్పించాలని కోరింది. నూనెల హానికరమైన వినియోగంపై అవగాహన పెంచేందుకు పాఠశాల లాబీలు, కెఫ్టేరియాలు, సమావేశ మందిరాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో డిజిటల్/ స్టాటిక్ పోస్టర్ల రూపంలో ఆయిల్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే, ఊబకాయంపై పోరాటంలో భాగంగా రోజూ గుర్తు చేసేలా స్టేషనరీ (లెటర్‌హెడ్‌లు, ఎన్వలప్ కవర్లు, నోట్ ప్యాడ్‌లు వంటివి)పై ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సందేశాలను ముద్రించాలని ఆదేశాలు వెలువరించింది. పండ్ల వినియోగం పెంచడం, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమను ప్రోత్సహించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్స్‌లో మెట్ల వాడకాన్ని ప్రోత్సహించడం, చిన్న చిన్న వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది.
పిల్లల ఆరోగ్యం కోసం 'ఆయిల్ బోర్డులు' : పాఠశాలలకు సీబీఎస్‌ఈ లేఖ
July 16, 2025
0
Tags