'అల్‌ ఉమ్మా'తో సంబంధాలున్న అబూబకర్‌ సిద్దిఖ్, మహమ్మద్‌ అలీ అరెస్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్‌ సిద్దిఖ్‌ అలియాస్‌ అమానుల్లా, మహమ్మద్‌ అలీ అలియాస్‌ మన్సూర్‌లు కరుడుగట్టిన ఉగ్రవాదులని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. తమిళనాడుకు చెందిన వీరు టెక్నికల్‌గా నిపుణులని, పక్కాగా పథకం వేసి బాంబు పేలుళ్లకు పాల్పడడంలో సిద్ధహస్తులని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిని జూన్‌ 30న తమిళనాడు ఇంటెలిజెన్స్‌ బ్యూరో పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. రాయచోటి పోలీసు పరేడ్‌ మైదానం వద్ద గురువారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ వివరాలు వెల్లడించారు. అబూ బకర్‌ సిద్దిఖ్, మహమ్మద్‌ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్నారు. తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు. అబూ బకర్‌ సిద్దిఖ్‌ తమిళనాడు నాగూరు, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై అతడి మీద కేసులు నమోదయ్యాయని తెలిపారు. అల్‌ ఉమ్మాతో అబూబకర్‌ సిద్దిఖ్, మహమ్మద్‌ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్‌ తరహా భావజాలం కలిగినది. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు దొరికాయి. రాయచోటిలో ఉగ్రజాడ తెలిసినప్పటి నుంచి అందరిలో భయం నెలకొంది. ఉగ్రవాదులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా చిన్న సమాచారం కూడా వెలుగులోకి రాకపోవడాన్ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు, తమిళనాడు పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులను టీమ్‌లుగా విభజించారు. ఉగ్రవాదుల ఇంటి చుట్టుపక్కల వారిని ఇప్పటికే విచారించిన పోలీసులు.. బంధువులు, స్నేహితులపై దృష్టిసారించారు. రోజూ డీఎస్పీ కార్యాలయానికి పలువురిని తీసుకొచ్చి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)