సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (92) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడు అయిన శివశక్తి పలు సినీ గీతాలను రచించారు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబరు 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. చిన్నతనంలోనే కళలపై ఆసక్తి ఉన్న ఆయన.. ఇంటినుంచి వెళ్లిపోయి ముంబయిలోని ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగొచ్చి కమలేశ్ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత సంగీతంపై ఇష్టంతో గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. అనంతరం మద్రాసు వెళ్లిపోయి సోదరుడు విజయేంద్రప్రసాద్‌తో కలిసి సినీరంగంలోకి వచ్చారు. 1988లో వచ్చిన 'జానకి రాముడు' సినిమాతో వీరికి మంచి పేరొచ్చింది. ఈ సినిమాకు శివశక్తి దత్తా స్క్రీన్‌రైటర్‌గా పనిచేశారు. బాహుబలి 1 (మమతల తల్లి, ధీవర), బాహుబలి 2 (సాహోరే బాహుబలి), ఎన్టీఆర్: కథానాయకుడు (కథానాయక), ఆర్‌ఆర్‌ఆర్ (రామం రాఘవమ్), హనుమాన్ (అంజనాద్రి థీమ్ సాంగ్), సై (నల్లా నల్లాని కళ్ల పిల్ల), ఛత్రపతి (మన్నేల తింటివిరా), రాజన్న (అమ్మా అవని) వంటి సినిమాల్లో కొన్ని పాటలకు లిరిక్స్ రాశారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, కల్యాణి మాలిక్, శివశ్రీ కంచి. ఆయనకు ఒక అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. ఆయన తమ్ముడు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న. శివశక్తి దత్తా మృతిపై ఇండస్ట్రీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూత
July 08, 2025
0
Tags