ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాల మంజూరులో జాప్యం, మహిళా ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో వైకాపా అసభ్య ప్రచారం వంటి అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో అమరావతికి రూ.15 వేల కోట్ల నిధులు తెచ్చుకున్నామని అన్నారు. ''ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రస్తావించబోతున్నాం. ఎమర్జెన్సీ పాలనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దానిపై చర్చిస్తాం. క్వాంటం వ్యాలీపై చర్చిస్తాం. భారత్ గౌరవ్ రైళ్లు, ఏరోస్పేస్ పాలసీపై పార్లమెంట్‌లో చర్చిస్తాం. పెండింగ్ ప్రాజెక్టుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరతాం.'' అని అన్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం : ఎంపీలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
July 18, 2025
0
Tags