హిమాచల్ ప్రదేశ్‌లోని జూన్ 20 నుంచి జులై 6 వరకు 23సార్లు ఆకస్మిక వరదలు వచ్చాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మంది ఆచూకీ లేకుండా పోయారు. వారికోసం గాలింపు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా సోమ, మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మండి జిల్లా తునాగ్ ప్రాంతంలోని ఎనిమిదివేల మంది ప్రజలకు ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. అయితే గత నెల నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం దానిపై పడింది. వాన నీరు, కొట్టుకొచ్చిన శిథిలాలు బ్యాంక్ రెండు అంతస్తుల భవనంలోని మొదటి ఫ్లోర్‌ను ముంచెత్తాయి. దాంతో దాని షటర్లు దెబ్బతిన్నాయి. ఈ విపత్తుతో కోట్లాది రూపాయల నగదు, బంగారం డిపాజిట్లపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. స్థానిక వ్యాపారి ఒకరు మాట్లాడుతూ ''మా ప్రాంతంలో ఉన్న బ్యాంక్ ఇదొక్కటే. చాలాకాలం నుంచి ఇది నడుస్తోంది. దీనిలో ప్రతిరోజు భారీ సంఖ్యలో లావాదేవీలు జరుగుతుంటాయి. ఇప్పుడు అందులో ఉంచిన నగదు, బంగారం, పత్రాలు ఏమైఉంటాయో?'' అని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వరదల్లో ఏవైనా కొట్టుకుపోయి, దోపిడీకి గురికావొచ్చని స్థానికులు కాపలాకాస్తుండటం గమనార్హం.
హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంక్‌ను ముంచిన వరదలు
July 07, 2025
0
Tags