భారత్- బంగ్లాదేశ్ మధ్య బంధాన్ని మరింత దృఢంగా మలిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి బంగ్లాదేశ్ గుడ్ విల్ కింద వెయ్యి కిలోల మామిడి పండ్లను బహుమతిగా పంపించింది. ఈ రకం మామిడి పండ్లను హరిభంగా మామిడి అని స్థానికంగా పిలుస్తారు. మ్యాంగో డిప్లోమసీ కింద ఈ పండ్లను ధాకా నుంచి ఢిల్లీ చేరుకున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్ వ్యవహారంపై మాట్లాడిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. బంగ్లాదేశ్ తో భారత్ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగించాలని కోరుకుంటోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని మోదీకి మామిడి పండ్లను అందజేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు ధాకా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఓ వైపు రాజకీయ సంక్షోభం, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల కొరతతో పాటు హింస, దాడులతో ఆ దేశం అట్టుడుకిపోతోంది. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వానికి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ క్రమంలో భారత్ లాంటి సరిహద్దు దేశం మద్దతు బంగ్లాకు ఎంతో అవసరం. ప్రధాని మోడీతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, త్రిపుర సీఎం మానిక్ సాహాలకు కూడా గుడ్ విల్ లో భాగంగా మామిడి పండ్లను పంపించింది బంగ్లాదేశ్. సరిహద్దు రాష్ట్రాలతోనూ సత్సంబంధాలను కొనసాగించాలని యూనస్ ప్రభుత్వం భావిస్తోంది.
భారత్ కు గుడ్ విల్ కింద వెయ్యి కిలోల మామిడి పండ్లను బహుమతిగా పంపిన బంగ్లాదేశ్
July 16, 2025
0
Tags