మరోసారి ఎల్‌ఐసీలో వాటాలను విక్రయించనున్న కేంద్రం ?

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో మరోసారి తన వాటాను విక్రయించనుంది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగం దీనిపై పనిచేస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎల్‌ఐసీలో కేంద్రానికి ప్రస్తుతం 96.5 శాతం వాటా ఉంది. 2022 మే నెలలో ఐపీఓలో భాగంగా 3.5 శాతం వాటాను కేంద్రం విక్రయించింది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.902-949గా పేర్కొంది. తద్వారా రూ.21 వేల కోట్లు ఖజానాకు సమకూరాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో తదుపరి వాటా విక్రయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయని సమాచారం. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వాటా విక్రయ ప్రక్రియను పెట్టుబడుల ఉపసంహరణ విభాగం పూర్తి చేయనుంది. 2027 మార్చి 16 నాటికి పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ను 10 శాతం ఉండాలన్న నిబంధనను చేరుకోవడంలో భాగంగా మరో 6.5 శాతం వాటాను కేంద్రం విక్రయించాల్సి ఉంటుంది. అయితే, ఎంతమేర వాటా విక్రయిస్తారు? ఎంత ధరకు విక్రయిస్తారు? ఎప్పుడు విక్రయిస్తారు? అనే వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.5.85 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ షేరు రూ.926 వద్ద ట్రేడవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)