అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం లోక్‌సభలో సమగ్ర ప్రకటన చేశారు. ఈ టారిఫ్‌ల వల్ల భారతీయ వాణిజ్య రంగంపై పడే ప్రభావం, భవిష్యత్ కార్యాచరణపై పార్లమెంట్‌లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య జరిపిన చర్చల్లో 10 నుంచి 15 శాతం టారిఫ్‌ల గురించే ప్రస్తావన వచ్చిందని, ప్రస్తుత 25 శాతం పెంపు ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం అమెరికా విధించిన ఈ సుంకాల ప్రభావంపై నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. దేశీయ పరిశ్రమల భద్రతకు, భారతీయ రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. "అమెరికాతో నాలుగు రౌండ్ల ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి అనేక కీలక సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఆ చర్చలన్నింటిలోనూ దిగుమతులపై 10 నుండి 15 శాతం టారిఫ్ విధించడంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇరు దేశాలు సానుకూలంగానే ఉన్నాయి. పలు వర్చువల్ సమావేశాలు కూడా జరిగాయి. అయినప్పటికీ, తాజా ప్రకటన అంచనాలకు విరుద్ధంగా ఉంది. అయినప్పటికీ, మేము మా దేశీయ పరిశ్రమలను పటిష్టంగా రక్షిస్తాం. దేశ ప్రయోజనాల కోసం అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటాం" అని పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారత్ 16 శాతం తోడ్పాటు అందిస్తోందని, ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావాలను అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. భారత్ భవిష్యత్ లక్ష్యాలపై తన దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యక్తం చేశారు. నేడు భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం దేశంలోని పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని.. దేశాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడానికి ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్నేళ్లలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదుగుతామన్నారు. గత కొంతకాలంగా ఎగుమతులు పెరిగాయన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆశాదీపంగా ఉందని ఆయన పార్లమెంటులో అభివర్ణించారు. ప్రభుత్వం రైతులు, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తుందని పేర్కొన్నారు. దేశ వాణిజ్య ప్రయోజనాలకు ఎటువంటి నష్టం కలగకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని.. ఇది భారతీయ ఎగుమతులకు కొత్త ఊపునిచ్చిందని గుర్తి చేశారు. భారత్ ప్రపంచ వాణిజ్యంలో పటిష్టంగా నిలబడుతుందని, దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విధించిన ఈ 25 శాతం టారిఫ్‌కు భారత్ ఎలా ప్రతిస్పందిస్తుందనే దానిపై ప్రభుత్వ వర్గాలు కీలక సమాచారం అందించాయి. ప్రస్తుతానికి భారత్ అమెరికా చర్యకు ప్రతీకారంగా ఎలాంటి ప్రతీకార సుంకాలు విధించదని తెలుస్తోంది. ఈ పరిణామంతో ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని, దీనిని ఓ సవాలుగా స్వీకరిస్తోందని పేర్కొన్నాయి. "ఈ టారిఫ్‌పై ఎలాంటి ప్రతిస్పందన ఉన్నా, అది శాంతంగా, వ్యూహాత్మకంగా, చర్చల ద్వారా మాత్రమే ఉంటుంది. ఆవేశంతో కూడిన నిర్ణయాలు తీసుకోం" అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
టారిఫ్‌లపై 25 శాతం పెంపు ఆశ్చర్యకరంగా ఉంది !
July 31, 2025
0
Tags