మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ పంపుల వద్దకు వస్తే వారికి ఇంధనం నింపేందుకు అనుమతి నిరాకరించనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. మంగళవారం జరిగిన సమావేశంలో రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్టులు పెట్టుకొనేలా ఇందౌర్‌లో ఓ క్యాంపెయిన్ చేపట్టాలని సప్రే ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌లేకుండా వస్తే పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించనున్నట్లు ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఏడాది జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా లేదా రెండూ ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇండోర్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన నేపథ్యంలో ఇందౌర్ జిల్లా యంత్రాంగం కఠినచర్యలకు ఉపక్రమించింది.
ఆగస్టు 1 నుంచి ఇండోర్ జిల్లాలో హెల్మెట్ లేకపోతే ఇంధనం నింపరు !
July 30, 2025
0
Tags