తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన చేశారు. ఉచిత ఇసుక కూపన్ల పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని ఇంచెర్ల గ్రామంలో బుధవారం మంత్రి సీతక్కతో పొంగులేటి కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ములుగు నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటు ఐటీడీఏ పరిధి దృష్ట్యా మరో 1500 ఇండ్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ మంత్రి సీతక్క అభ్యర్థన మేరకు మరో 1000 ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నామన్నారు. లబ్దిదారులు మరో 10-15 రోజుల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ప్రతి సోమవారం వారికి నిధులను విడుదల చేస్తామని తెలిపారు. అటవీ భూముల్లో ఇప్పటి వరకు చిన్నపాటి ఇంట్లో నివసిస్తున్న ప్రజలకు అక్కడే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పించాలంటూ అటవీ అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్రంలో చెంచులకు ప్రత్యేకంగా 10 వేల ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం పేదలకు 25.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని వివరించారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలు రాజ్యమేలినా కేవలం 92 వేల ఇళ్లకు మాత్రమే ఒకే చెప్పిందన్నారు. 60 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. ఇందులో 30 వేలకు పైగా ఇళ్లు మొండిగోడలతో మిగిలిపోయాయన్నారు. కట్టిన ఇళ్లకుగాను కాంట్రాక్టర్లకు కూడా డబ్బు చెల్లించలేదని ఎద్దేవా చేశారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు స్థానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగినా వారి భూ సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని.. అది భూభారతి గొప్ప తనమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక !
June 11, 2025
0
Tags