జపాన్‌ ప్రైవేటు కంపెనీ చేపట్టిన జాబిల్లి యాత్ర విఫలం

Telugu Lo Computer
0


చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టేందుకు జపాన్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ 'ఐస్పేస్‌' మూన్‌ మిషన్‌ను ప్రయోగించింది. అయితే, జాబిల్లిపై దిగే సమయంలో 'రెసిలెన్స్' ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో ప్రయోగం విఫలమైంది. జూన్ 6, 2025 ఉదయం 8:00 గంటలకు ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఆగిపోయినట్లు ఐస్పేస్‌ మిషన్ కంట్రోలర్లు వెల్లడించారు. వాటిని తిరిగి పునరుద్ధరించడం అసంభవమని, దీంతో మిషన్‌ను ముగించామని పేర్కొన్నారు. దీనికి గల కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు తకేషి హకమడ తెలిపారు. రెసిలెన్స్‌ ల్యాండర్‌ను ఈ ఏడాది జనవరిలో స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ నుంచి ప్రయోగించారు. దాదాపు ఐదు నెలల పాటు ప్రయాణించిన ఈ వ్యోమనౌక మే నెలలో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రణాళిక ప్రకారం ఈ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలంపై ఉన్న 'మేర్ ఫ్రిగోరిస్' అనే పాయింట్‌ వద్ద సాఫ్ట్‌ ల్యాండ్‌ అవ్వాలి. అయితే రెసిలెన్స్‌ కక్ష్య నుంచి విడిపోయి గమ్యస్థానానికి వెళ్లిన తర్వాత మిషన్‌ కంట్రోలర్లు ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ను కోల్పోయారు. కాగా ఐస్పేస్‌ జాబిల్లి యాత్రకు యత్నించడం ఇది రెండోసారి. 2023లోనూ ల్యాండర్‌ను పంపించగా అది విఫలమైంది. ఇక, జాబిల్లిని చేరుకున్న అయిదో దేశంగా జపాన్‌ ఇప్పటికే గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. గతేడాది జపాన్‌ ప్రయోగించిన SLIM అనే ల్యాండర్‌ చంద్రుడిపై సురక్షితంగా దిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)