భాష అనేది ఎక్కడా అడ్డు కాదని అది ఒక వారధి మాత్రమే అని, మాతృభాషతో సమానంగా ఇంగ్లీషు భాషపై కూడా పట్టు సాధించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటి చిన్నారులు ఇంగ్లీషు భాష నేర్చుకోవడం బీజేపీ ఆర్ఎస్‌ఎస్ నాయకులకు ఇష్టం లేదని, ఒకవేళ నేర్చుకుంటే వారికి ఇబ్బందికరంగా మారుతుందనే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. చిన్న పిల్లలు ఇంగ్లీషు భాష నేర్చుకుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలను ప్రశ్నిస్తారు కాబట్టే... అమిత్ షా లాంటి నేతలు ఇంగ్లీషు భాషపై తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.దేశంలోని ప్రతి భాషకు ఒక ఆత్మ, సంస్కృతి, విజ్ఞానం ఉందని పేర్కొన్న రాహుల్ ఫలానా భాష మాట్లాడుతున్నందుకు గర్వపడాలని చెప్పారు. ప్రతి ఒక్క చిన్నారికి ఇంగ్లీషు భాషపై పట్టు రావాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ అధినేత...ఇంగ్లీషు పై పట్టు ఉంటేనే నేటి పోటీ ప్రపంచంలో నెట్టుకురాగలమని ముఖ్యంగా భారత్ ఇతర ప్రపంచ దేశాలతో పోటీపడగలదని నొక్కి చెప్పారు. మాతృభాష ఎంత ముఖ్యమో ఈరోజు ఇంగ్లీషు నేర్చకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పిన రాహుల్ గాంధీ.. అదే సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుందని అందుకే ఎవరేమి మాట్లాడిన ఇంగ్లీషు నేర్చుకోవాలని చిన్నారులకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు తమ పిల్లలను ఇంగ్లాండ్, అమెరికాలాంటి దేశాలకు పంపుతున్నారని చెప్పిన రాహుల్ గాంధీ..ఇంగ్లీష్ భాష ఒక ఆయుధంలా పనిచేస్తుందని అన్నారు.ఇంగ్లీషు నేర్చుకుంటే విదేశాల్లో ఉద్యోగాలు పొందొచ్చని చెప్పారు. ఇంగ్లీషు నేర్చుకోవద్దని చెప్తున్నారంటే దానివెనకున్న కుట్ర ఏంటో ఆలోచించాలని అన్నారు.ఇంగ్లీషు నేర్చుకుని మంచి ఉద్యోగం సంపాదించి కోట్ల జీతం తీసుకోవడం బీజేపీ ఆర్ఎస్ఎస్ వారికి ఏమాత్రం ఇష్టం లేదని రాహుల్ గాంధీ వివరించారు.దళిత సామాజిక వర్గానికి చెందిన పిల్లలు ఎస్సీ స్కూళ్లకు వెళ్లాలని అక్కడ ఇంగ్లీషు ఉండదని అదే బీజేపీ కోరుకుంటోందని అన్నారు.దళితులకు ఉన్న అవకాశాల ద్వారాలు మూసివేయాలన్నదే బీజేపీ ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా ఉందని చెప్పిన రాహుల్ గాంధీ... ఇంగ్లీషు అనే ఆయుధం మన వద్ద ఉంటే ప్రపంచాన్ని జయించొచ్చని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఒక దేశంలో లేదా సమాజంలో మాతృ భాష కాకుండా మరో భాష మాట్లాడే వ్యక్తులు ఎందుకు సిగ్గుపడాలి అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె ఝా. ప్రజాజీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇతర భాషలను గౌరవించాలని మంచి సత్సంబంధాలు ఏర్పడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమిత్ షా ఇంగ్లీషు భాష పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవని సీపీఐ రాజ్యసభాపక్ష నేత పి.సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రాజెక్టులో భాగంగా దేశ వ్యాప్తంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ఇంగ్లీషు భాషను అవమానించినట్లు కాదు కానీ... తమిళం, మళయాలం, తెలుగు, బెంగాలీతో పాటు ఇతర భాషలను కూడా అవమానించినట్లే అని అన్నారు. గురువారం రోజున ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఇంగ్లీషు భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంగ్లీషు మాట్లాడుతున్న వారు త్వరలో ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నామా అనే సిగ్గుపడే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. దేశ సంస్కృతిని అందంగా అలకరించే నగలాంటిది మన భాష అని చెప్పిన హోంమంత్రి... పరాయి భాషను భారతీయులు ఊహించలేరని , ఇంగ్లీషు లాంటి విదేశీ భాషతో భారత్‌ను ఊహించుకోలేమని అన్నారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
భాష అనేది ఎక్కడా అడ్డు కాదు, అది ఒక వారధి మాత్రమే !
June 20, 2025
0
Tags