అమర్నాథ్ యాత్ర విధుల్లో పాల్గొనేందుకు బీఎస్‌ఎఫ్ జవాన్లు జూన్ 9న త్రిపురలోని ఉదయపూర్ నుంచి జమ్ముకు ప్రయాణించాలి. సుదీర్ఘ ప్రయాణంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు, అధికారులకు సౌకర్యంగా ఉండేందుకు రెండు ఏసీ2-టైర్ కోచ్‌లు, రెండు ఏసీ3-టైర్ కోచ్‌లు, 16 స్లీపర్ కోచ్‌లు, నాలుగు జనరల్, ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లతో కూడిన రైలును ఏర్పాటు చేయాలని రైల్వేను బీఎస్‌ఎఫ్ కోరింది. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు చోట్ల సిబ్బంది ఆ రైలు ఎక్కుతారని పేర్కొంది. కాగా, ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ పరిధిలోని అలీపుర్దువార్ డివిజన్ ఏర్పాటు చేసిన రైలు చూసి బీఎస్‌ఎఫ్ జవాన్లు షాక్ అయ్యారు. రైలు బోగీల కిటికీలు, తలుపులు విరిగిపోయాయి. విద్యుత్ ఫిట్టింగ్‌లు పనిచేయడం లేదు. టాయిలెట్లు పాడయ్యాయి. శిథిలావస్థలో ఉన్న మురికి రైలుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ఈ సంఘటన రాజకీయంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అలీపుర్దువార్ రైల్ డివిజన్‌కు చెందిన ముగ్గురు సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, కోచింగ్ డిపో అధికారిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సస్పెండ్ చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అనంతరం బీఎస్‌ఎఫ్ జవాన్ల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. దీంతో ఉదయపూర్ నుంచి జమ్మూకు బీఎస్‌ఎఫ్ బృందం ప్రయాణించింది. కాగా, బీఎస్‌ఎఫ్ జవాన్లకు శిథిలావస్థలో ఉన్న మురికి రైలును ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ ఖండించింది. వైరల్ అయిన రైలు వీడియో క్లిప్ బీఎస్‌ఎఫ్ జవాన్లకు కేటాయించలేదని తెలిపింది. అది మరమ్మతుల కోసం పంపే రైలు అని పేర్కొంది.
బీఎస్‌ఎఫ్ జవాన్లకు మురికి రైలు ఏర్పాటు : నలుగురు అధికారులు సస్పెండ్
June 12, 2025
0
Tags