దొరికిన సొమ్మును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన యువకుడు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన రైతు రామకృష్ణ ఈ నెల నాలుగో తేదీ స్థానిక ఓ బ్యాంకులో బంగారు నగలు కుదవపెట్టి రూ. 86 వేలు తీసుకున్నారు. దాన్ని ద్విచక్ర వాహనం ముందున్న కవర్‌లో పెట్టుకుని తీసుకువెళుతూ మధ్యలో భోజనం కోసం ద్విచక్ర వాహనాన్ని నిలిపారు. ఈ విషయాలన్నీ గమనించిన ఓ వ్యక్తి అతడిని అనుసరించాడు. భోజనం కోసం మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం నిలిపిన సమయంలో అందులోని డబ్బు దోచుకువెళ్లాడు. ఆ రోజు అనుమానితుడిగా ఓ యువకుడిని పోలీసులకు అప్పగించగా సీసీ కెమెరాల్లో అతడు కాదని నిర్ధారించుకుని వదిలిపెట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు డబ్బు దొంగలించిన నిందితుడు స్థానిక శ్రీనివాసపురం వీధిలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం శ్రీనివాసపురం వీధిలో చెత్త సేకరణకు పంచాయతీ బండి వెళ్లింది. ఆ క్రమంలో చెత్త పోసేందుకు వెళ్లిన స్థానిక రాయదుర్గం సురేష్‌ అందులోని ఓ పాలిథిన్‌ కవర్‌లో నగదు ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ నగదుతో పాటు బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, పాన్‌కార్డును తీసుకుని ఎస్ఐ హనీఫ్‌కు అందజేశారు. అతడి నిజాయతీని ఎస్ఐ అభినందించి రూ. వేయి బహుమతిగా అందజేశారు. పాస్‌పుస్తకం, పాన్‌కార్డు ఆధారంగా ఆ మొత్తం చెన్నారెడ్డిపల్లికి చెందిన రైతు రామకృష్ణగా నిర్ధారించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)