తెలంగాణలో రైలు కింద పడి ప్రేమజంట బలవన్మరణం

Telugu Lo Computer
0


తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివారులోని అనంతారం రైల్వే వంతెన సమీపంలో రైలు కిందపడి ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. రైల్వే జీఆర్‌పీ ఇన్‌ఛార్జి కృష్ణారావు కథనం ప్రకారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండకు చెందిన కొటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్‌కుమార్‌ (25) ఆదే గ్రామానికి చెందిన మచ్చ కుమారస్వామి, రేణుక చిన్న కుమార్తె శ్రుతి(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రుతి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని తన అక్క ఇంట్లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. వినయ్‌కుమార్‌ డిగ్రీ పూర్తి చేసి జనగామలోని ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో పెళ్లికి నిరాకరించారు. శ్రుతికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో కలుసుకున్నారు. అక్కడి నుంచి భువనగిరికి చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. లోకోపైలట్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాల కోసం వెతకగా రాత్రి 11 గంటలకు గుర్తించారు. ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించారు. యువతి హ్యాండ్‌బ్యాగ్‌లో ఆధార్‌కార్డ్‌తో పాటు, ఆమె పనిచేస్తున్న కంపెనీకి సంబంధించిన గుర్తింపు ధ్రువపత్రం పోలీసులకు లభించాయి. ఇద్దరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. సెల్‌ఫోన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను భువనగిరి జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. శ్రుతి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహం చేశారు. మరణోత్తర పరీక్షల అనంతరం మృతదేహాలను సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే జీఆర్పీ ఇన్‌ఛార్జి కృష్ణారావు తెలిపారు

Post a Comment

0Comments

Post a Comment (0)