బీహార్ లో సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద లబ్ధి పొందే వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు వారు నెలకు పొందుతున్న రూ.400కి బదులుగా ఇకపై రూ.1100 లభించనుంది. ఈ పెరిగిన పెన్షన్ మొత్తాన్ని జూలై నెల నుంచి అమలులోకి తేనున్నట్లు సీఎం నితీష్ తెలిపారు. ప్రతి నెలా 10వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేయనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో దాదాపు 1 కోటి 9 లక్షల 69 వేల 255 మంది లబ్ధిదారులు ఈ పెరిగిన పెన్షన్ వల్ల లబ్ధి పొందనున్నారు. ఈ పెన్షన్ పెంపు గురించి స్వయంగా సీఎం నితీష్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. వృద్ధులు సమాజానికి విలువైన భాగమని, వారికో గౌరవప్రదమైన జీవితం కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని నితీష్ అన్నారు. బీహార్ ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలతో పాటు, ఇప్పుడు సామాజిక భద్రతా పథకాన్ని మరింత బలోపేతం చేయడం మంచి పరిణామమని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా పేద వర్గాలకు మంచి నిర్ణయంగా పరిగణించబడుతుంది.
బీహార్ లో సామాజిక భద్రతా పెన్షన్ పెంపు !
June 21, 2025
0
Tags