తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చిన మహాలక్ష్మీ పథకం ప్రస్తుతం అమలు చేస్తోంది. అయితే మూడు నెలలుగా 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ కి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న రాయితీ లబ్ధిదారుల ఖాతాలలో జమ కావడం లేదు. దీంతో మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్లు పొందుతున్న మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వంటగ్యాస్ సిలిండర్ ధర 915రూపాయలుగా ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు 915 రూపాయలు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత వీరికి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రాయితీ వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ కు సంబంధించి 500 రూపాయలు మినహాయించి మిగతా మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 375 రూపాయలు కలిపి మొత్తం 415 రూపాయల సబ్సిడీ లబ్దిదారులకు లభిస్తోంది. అయితే గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ జమ కాకపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. లబ్దిదారుల ఖాతాలో ఈ నిధులు జమ కాకపోవడం వెనుక 150 నుంచి 180 కోట్ల రూపాయల వరకు నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కావలసి ఉందని సమాచారం. ఆ నిధులు విడుదల అయితే మహిళల ఖాతాలలో సిలిండర్లకు సంబంధించిన రాయితీ డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం కావడం వల్ల వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని సమాచారం. అయితే ఈ రాయితీలు పూర్తిగా నిలిచిపోవని, త్వరలోనే వీటన్నింటినీ క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మహిళలలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం అందిస్తామని చెప్పిన సంక్షేమ పథకాన్ని ఆదిలోనే హంసపాదు అన్నట్టు కొంతకాలం పాటు కూడా కొనసాగించలేకపోతే ఎలా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులకు సమయానికి అన్నీ అందించగలిగితే ప్రయోజనం ఉంటుందని, లేదంటే ప్రభుత్వ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లబ్దిదారుల ఖాతాలలో పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని త్వరితగతిన జమ చేయాలని మహిళలు కోరుతున్నారు.
మహాలక్ష్మి పథకంలో సబ్సిడీ జమకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు
June 23, 2025
0
Tags