నైజీరియన్ ఇమ్మాన్యుయేల్ బెడియాకో (మ్యాక్స్‌వెల్) పసితనంలోనే పేదరికం కష్టాలు చవిచూశాడు.. వాటి నుంచి బయటపడేందుకు తన అన్న ఆదేశంతో స్మగ్లర్‌గా మారాడు. ఏటా రూ.కోటి విలువైన సింథటిక్ డ్రగ్స్ విక్రయించేంతగా ఎదిగాడు. మారుపేర్లతో పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న డ్రగ్ కింగ్‌పిన్ ఇమ్మాన్యుయేల్ బెడియాకో అలియాస్ మ్యాక్స్‌వెల్ (34)ను తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) ఎస్టీఎఫ్ డీఎస్పీ కె.మధుమోహన్‌రెడ్డి బృందం సోమవారం అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి రూ.1.25 కోట్ల విలువైన కొకైన్ (150గ్రా), ఎక్సటసీపిల్స్ 1100, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన ఇమ్మాన్యుయేల్‌కు నలుగురు సోదరులు, నలుగురు చెల్లెళ్లు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో పాఠశాల చదువు ఆపేసి కొంతకాలం ఓ పరిశ్రమలో కాపలాదారుగా పనిచేశాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా వరుసకు సోదరుడైన ఒన్యేసి రోమనస్ ఇకెచుక్వు అలియాస్ రోమియో భారత్‌లో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తున్నట్లు గ్రహించాడు. అతడు నైజీరియా వెళ్లిన ప్రతిసారి డబ్బు, ఖరీదైన వస్త్రాలను తమ్ముడు ఇమ్మాన్యుయేల్‌కు బహుమతిగా ఇచ్చేవాడు. గోవాలో తాను చేస్తున్న డ్రగ్స్ వ్యాపారంలో సహాయకుడిగా పనిచేస్తే పెద్దఎత్తున కమీషన్ ఇస్తానన్నాడు. ఇమ్మాన్యుయేల్ తొలిసారి 2013 నవంబరులో ఒమైసి ఎసోమ్చి కెన్నెత్‌తో మెడికల్ వీసాపై వైద్యం కోసం బెంగళూరు వచ్చాడు. సోదరుడు రోమియా సూచనతో గోవా చేరాడు. అక్కడే మ్యాక్స్‌వెల్‌గా పేరు మార్చుకున్నాడు. మత్తుపదార్థాల కొనుగోలుదారుల ఫోన్‌నంబర్లు తీసుకున్నాడు. 2013-2022 జులై వరకూ రూ.2 కోట్ల డ్రగ్స్ విక్రయించి 20 శాతం కమీషన్‌గా రూ.40లక్షలు సంపాదించాడు. మధ్యలో 2021లో నైజీరియా వెళ్లాడు. 2023 మార్చిలో ఉగ్వు ప్రామిస్ న్నెన్నాను పెళ్లిచేసుకున్నాడు. వారికి ఇటీవలే కుమార్తె పుట్టింది. 2023 డిసెంబరులో రెండోసారి ఎజురుయికే చిరోటం వాలెంటైన్ పేరుతో మెడికల్ వీసాపై ఢిల్లీకి చేరాడు. గోవా వెళ్లి రోమియో సహాయంతో డ్రగ్స్ వ్యాపారం కొనసాగించాడు. జులై 2024 వరకు రూ.కోటి డ్రగ్స్ విక్రయించి కమీషన్‌గా రూ.20లక్షలు సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సొంతదేశం వెళ్లాడు. ఈ ఏడాది జనవరిలో రోమియా 2 లక్షల నాయిరా (స్థానిక కరెన్సీ) అతడి బ్యాంకు ఖాతాలో జమచేశాడు. ఘనాలో ఇన్నోసెంట్ పెప్పర్‌ను కలిసి ఘనా పాస్‌పోర్టుపై భారత్‌కు రావాల్సిందిగా సలహా ఇచ్చాడు. అన్న సూచనతో ఇమ్మాన్యుయేల్ ఘనాకు వెళ్లి ఆ వ్యక్తిని కలిశాడు. మూడోసారి ఇమ్మాన్యుయేల్ బెడియాకో మారుపేరుతో పాస్‌పోర్టు సంపాదించి జనవరి 25న మెడికల్ వీసాపై ఢిల్లీ మీదుగా గోవాకు చేరాడు. కొనుగోలుదారులకు సెలబ్రిటీ కొకైన్ (ప్యూర్ కొకైన్), ఎండీఎంఏ గ్రాము రూ.25వేలు, ఎక్సటసీపిల్స్ ఒక్కోకటి రూ.6వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. 2024-25 మధ్య మనీలాండరింగ్ కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ కమీషన్ రూపంలో చేతికొచ్చిన రూ.1.17కోట్లను భారత్‌లోని హవాలా నిర్వాహకుల సహకారంతో నైజీరియాలోని భార్య, అన్న, బామ్మర్ది పేరిట ఉన్న 150 బ్యాంకు ఖాతాల్లోకి రూ.56 లక్షలు మళ్లించినట్టు నిర్దారించారు. బెంగళూరులో వైద్యానికి మెడికల్ వీసాపై వచ్చిన నిందితుడు తిరిగి వెళ్లలేదు. గోవాలో ఖరీదైన విల్లాను అద్దెకు తీసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. డ్రగ్స్ దందాలో రోమియో, మ్యాక్స్‌వెల్ ఒకే ఫోన్ నంబర్ ఉపయోగిస్తారు. ఒకరు భారత్‌లో ఉన్నప్పుడు మరొకరు నైజీరియాలో ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరు ఒకే కొనుగోలుదారులకు డ్రగ్స్ చేరవేస్తుంటారు. స్మగ్లింగ్‌లో వచ్చిన లాభాలను హవాలా మార్గంలో సొంత దేశాల్లోని ఖాతాలకు మళ్లిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం డ్రగ్స్ అందజేసేందుకు మ్యాక్స్‌వెల్ సైనిక్‌పురి చేరాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి టీజీన్యాబ్ డీఎస్పీ మధుమోహన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు డి.సంతోష్‌కుమార్, జి.గోపి, ఎస్సైలు వెంకటేశ్, షేక్ బురాన్ బృందం నిందితుడిని అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారులు సన్నీ, రోమియో పరారీలో ఉన్నారు.
నైజీరియన్ నుంచి రూ.1.25 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
June 03, 2025
0
Tags