ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు 11 కొవిడ్‌ కేసులు నమోదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు మరో 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గురువారం ఒక్కరోజే నలుగురికి, నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది. నెల్లూరు జీజీహెచ్‌లో బుధవారం ఆరుగురికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో గురువారం నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా కర్నూలు రూరల్‌ మండలం దిన్నెదేవరపాడులో 25 ఏళ్ల మహిళకు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఏ.తిమ్మాపురం గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్ల మండలం లింగందిన్నెకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలు నగరానికి చెందిన 20 ఏళ్ల యువతికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని కర్నూలు జీజీహెచ్‌లోని వీఐపీ నెగిటివ్‌ ప్రెజర్‌ రూంకు తరలించారు. కర్నూలు జీజీహెచ్‌లో కొవిడ్‌ పాజిటివ్‌ల సంఖ్య ఆరుకు చేరింది. బ్రెయిన్‌ ట్యూమర్‌తో కేజీహెచ్‌ న్యూరో సర్జరీ విభాగంలో చేరిన విజయనగరం జిల్లాకు చెందిన పద్నాలుగేళ్ల బాలికకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గడిచిన నాలుగు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుండడంతో వైద్యులు ర్యాపిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సదరు బాలికను ఐసొలేషన్‌ వార్డుకు తరలించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. ఫలితం రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)