ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వెంకటగిరి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆదివారం కాకాణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు మధ్య జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి ఆయనను కోర్టుకు తరలించారు. తొమ్మిది పోలీసు వాహనాల్లో, ప్రత్యేక పోలీసు బలగాలు మధ్య వెంకటగిరికి తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎదుట కాకాణిని హాజరుపరిచారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన పోలీసు బృందాలు ఆయన బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్‌లో ఉన్నట్లు పసిగట్టి ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాయి. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో కాకాణి నాలుగో నిందితుడి (ఏ4)గా ఉన్నారు. బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన్ను నెల్లూరుకు తీసుకొచ్చారు.
కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
May 26, 2025
0
Tags