గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు

Telugu Lo Computer
0


ర్ణాటకలోని గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటక శాసనసభ అనర్హత వేటు వేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాలాక్షి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 'హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు, సీసీ నెం.1 ఆఫ్ 2012లో గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక శాసనసభ సభ్యుడు జి.జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించినందున, ఆయన దోషిగా తేలిన తేదీ అనగా 2025 మే 6 నుంచి కర్ణాటక శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించడమైనది' అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఇ), ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాలి జనార్దన్ రెడ్డికి విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే, విడుదలైన నాటి నుంచి మరో ఆరేళ్లపాటు అనర్హత కొనసాగుతుందని వివరించారు. దీంతో కర్ణాటక శాసనసభలో ఒక స్థానం ఖాళీ అయిందని నోటిఫికేషన్ వెల్లడించారు. మే 6న వెలువడిన ఓబుళాపురం మైనింగ్ కేసు తీర్పులో, గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టం కలిగించారని పేర్కొంటూ జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2009 నాటి ఈ కేసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతిని వెలుగులోకి తెచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)