రౌడీ షీటర్‌ హత్యతో మంగళూరులో హై అలర్ట్‌ !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని మంగళూరులో రౌడీ షీటర్‌ హత్య కారణంగా పోలీసుల హై అలర్ట్‌ ప్రకటించి నగరంలో భారీ బందోబస్తు ఏ‍ర్పాటు చేశారు. మత ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులను టార్గెట్‌ చేసిన బీజేపీ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌ పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నారు. అందిన సమాచారం మేరకు మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న సుహాస్‌పై దాడి జరిగింది. రాత్రి 8:30 గంటలకు సుహాస్ తన స్నేహితులతో కలిసి బాజ్‌పేలోని కిన్నికంబ్లాలో కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరుగురు ప్రత్యర్థులు కారును అడ్డగించి వాహనంపై దాడి చేశారు. అనంతరం కారులోంచి సుహాస్ శెట్టిని బయటకు లాగి విచక్షణారహితంగా కత్తులతో, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ దాడి తర్వాత సుహాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సుహాస్‌ మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత ఘర్షణలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళూరు ఏడీజీపీ హితేంద్ర మాట్లాడుతూ 'సుహాస్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోస్ట్‌మార్టం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించాం. పోలీస్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి. మంగళూరు పౌరులు ప్రశాంతంగా ఉండాలి. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇది శాంతిభద్రతల వైఫల్యం కాదు' అని అన్నారు. ఇదిలా ఉండగా సుహాస్ శెట్టిపై కనీసం ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2022లో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన కొద్ది రోజులకే సూరత్కల్‌లో 23 ఏళ్ల యువకుడు ఫాజిల్‌ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఫాజిల్ హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుతం ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సుహాస్‌ శెట్టి హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. సుహాస్‌ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక, వీహెచ్‌పీ నేతలు మంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో, మంగళూరులో పలుచోట్ల దుకాణాలను మూసివేశారు. బస్సు సర్వీసులను నిలిపివేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)