లిక్కర్ స్కాంలో ముందస్తు బెయిల్ నిరాకరణ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంపై సీఐడీ చురుగ్గా దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కెసిరెడ్డితో పాటు పలువురిని అరెస్టులు కూడా చేసింది. విచారణలో వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా గత ప్రభుత్వంలో సీఎం జగన్ సీఎంవోలో పనిచేసిన అధికారుల్ని అరెస్టు చేసేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. దీంతో వారు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జగన్ ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డితో పాటు లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్న బాలాజీ గోవిందప్ప అరెస్టు కాకుండా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ అభిప్రాయం కోరింది. దీంతో పీపీ ప్రభుత్వ అభిప్రాయం తీసుకుని చెప్తానని హైకోర్టుకు తెలిపారు. దీంతో వీరికి ఇప్పటికిప్పుడు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పారని, కాబట్టి తాము అరెస్టు అయ్యే అవకాశం ఉందని వీరు హైకోర్టును కోరారు. అయితే ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పేసింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను మే7వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు ప్రభుత్వం వీరి బెయిల్ పై తమ అభిప్రాయం చెప్పాల్సి ఉంది. మరోవైపు రాజ్ కెసిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ స్కాంపై దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు సీఐడీ సిద్దమవుతోంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని విచారించినా పూర్తి వివరాలు లభించకపోవడంతో మరిన్ని అరెస్టులు చేసేందుకు సీఐడీ పావులు కదుపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)