తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగతనం జరిగిన విషయం సంచలనంగా మారింది. రాజ్‌భవన్‌లోకి ఓ వ్యక్తి అంత దర్జాగా ఎలా వెళ్లగలిగాడు.. హెల్మెట్ పెట్టుకుని ఫేస్ కవర్ చేసుకుని కంప్యూటర్ రూమ్‌లోకి ఎలా చొరబడ్డాడు? ఇది ఇంటి దొంగ పనా? వేరెవరి పాత్ర అయినా ఉందా అనే దానిపైనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. నిత్యం హై సెక్యూరిటీతో ఎంతో హడావిడిగా ఉండే రాజ్‌భవన్‌లో ఓ అగంతకుడు చేతి వాటం చూపాడు. రాజ్ భవన్‌లో విలువైన హార్డ్ డిస్క్‌లు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సుధర్మ భవన్‌లో మొత్తం 4 హార్డ్ డిస్క్‌లు మాయం అయినట్లు రాజ్‌భవన్ సిబ్బంది పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న రూమ్ నుంచి ఈ హార్డ్ డిస్క్‌లు మాయం చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రాజ్‌భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదటి అంతస్తులో ఉన్న రూమ్ నుంచి హార్డ్‌డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్టు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. మే 14వ తేదీ రాత్రి హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్టు నిర్థారించారు. హార్డ్‌డిస్క్‌లలో రాజ్‌భవన్ వ్యవహారాలతోపాటు కీలకమైన కొన్ని రిపోర్ట్‌లు, ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. 14వ తేదీన హెల్మెట్‌తో కంప్యూటర్ రూమ్‌లోకి వెళ్లింది ఎవరు? అనే దానిపై ప్రస్తుతం పోలీసులు దృష్టిసారించారు.
తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్‌డిస్క్‌ల చోరీ !
May 20, 2025
0
Tags