ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ గురువారం ప్రారంభించిన మాటా మంతి కార్యక్రమాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లాలన్‌సింగ్ అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. డిజిటల్ వేదికల ద్వారా గ్రామీణ ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం వినూత్నం, ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ మహోత్సవ్-2025 ఆశయానికి అనుగుణంగా నిర్వహిస్తున్న 'మాటా మంతి' విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీనిపై మంత్రి పవన్‌కల్యాణ్ స్పందించారు. 'ఏపీలో చేస్తున్న కార్యక్రమాలకు మీ మద్దతు ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి అన్ని గ్రామాలకూ చేరినప్పుడే నిజమైన ప్రగతి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామి కావాలి. అప్పుడే నిజమైన గ్రామస్వరాజ్య స్ఫూర్తి సాధించగలం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గ్రామ సభ, పల్లె పండగ, అడవితల్లి బాట, ఇప్పుడు మాటామంతి కార్యక్రమాలతో ముందుకెళుతున్నాం. ప్రధాని ప్రారంభించిన గ్రామీణ భారత్ మహోత్సవాన్ని ఉత్సాహంగా చేసుకుంటున్నాం' అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్‌కల్యాణ్‌ని అభినందించిన కేంద్ర మంత్రి లాలన్‌సింగ్
May 23, 2025
0
Tags