సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద గోడ వద్దకు చేరింది. పునాది బలంగా లేని గోడ కాబట్టి నీరు, బురద బరువుకు తట్టుకోలేక గోడ ఒక్కసారిగా కూలిపోయిందని కమిషన్ అంచనాకు వచ్చింది. సింహాచలం ఘటన జరిగిన నేపథ్యంలో 72 గంటల్లోనే నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఘటనపై.. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ విభాగాధిపతి ఐజీ రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. పలు సంచలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. గోడను పునాదులు కుడా లేకుండా నిర్మించారు. వర్షపు నీరు వెళ్లేందుకు కనీసం గోడకు లీప్ హోల్స్ కూడా పెట్టలేదని తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అప్పన్న చందనోత్సవానికి ఏడు రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు తేలిందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆలయాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రసాద్ స్కీమ్ లో భాగంగా గోడ నిర్మాణాన్ని తూతూమంత్రంగా నిర్మించారని పేర్కొంది. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు లేక పోగా పునాది కూడా లేకుండా నిర్మించేశారని ప్రాథమిక నివేదికలో కమిషన్ పేర్కొంది. గోడ నిర్మించే సమయంలోనూ ఎలాంటి తనిఖీలు చేయలేదని త్రిసభ్య కమిషన్ అభిప్రాయ పడింది.
సింహాచలం ఆలయంలో పునాది లేకుండా గోడ కట్టారు ?
May 05, 2025
0
Tags