ఆరు నెలల్లో 25 టన్నుల కొనుగోలు చేసిన ఆర్‌బీఐ !

Telugu Lo Computer
0


భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. ఇతర దేశాల్లోని కేంద్ర బ్యాంకుల మాదిరిగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో 25 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న వేళ ఇంత పెద్ద మొత్తంలో పుత్తడిని ఆర్‌బీఐ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ మేరకు అధికారిక గణాంకాలను తాజాగా విడుదల చేసింది. 2024 సెప్టెంబర్‌ నాటికి ఆర్‌బీఐ వద్ద 854.73 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉండగా.. ఆ మొత్తం 879.59 టన్నులకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 57 టన్నుల పసిడిని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. ఓ వైపు పసిడి ధరలు 30 శాతానికి పైగా పెరిగిన వేళ.. ఈ స్థాయిలో పసిడిని కొనుగోలు చేయడం విశేషం. గడిచిన ఏడేళ్లలో ఈ స్థాయిలో పుత్తడి కొనుగోలు చేయడమూ ఇదే తొలిసారి. ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల్లో స్థానికంగా 511.99 టన్నులు నిల్వ చేయగా.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ వద్ద 348.62 టన్నులు, గోల్డ్‌ డిపాజిట్ల రూపంలో 18.98 టన్నులు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో ఇంగ్లాండ్‌ నుంచి భారీఎత్తున బంగారం నిల్వలను ఆర్‌బీఐ భారత్‌కు తరలించింది. దాదాపు 100 టన్నుల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. 2024 మార్చి 31 నాటికి 408 టన్నులుగా ఉన్న నిల్వలు.. సెప్టెంబర్‌ 30 నాటికి 510.46 టన్నులకు చేరాయి. 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్‌ పెద్దఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో భౌగోళిక ఉద్రిక్తలు పెరుగుతున్న వేళ మళ్లీ అదే స్థాయిలో పసిడిని తరలించింది. భారత్‌ దగ్గర ఉన్న మొత్తం విదేశీ మారకపు నిల్వలల్లో బంగారం వాటా 11.70 శాతానికి చేరింది. ఆరు నెలల క్రితం ఈ మొత్తం 9.32 శాతంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)