భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేశంలో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి కీలకమైన ఆహార పదార్థాల ధరలు నియంత్రణలో ఉండేలా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని నగరాల్లో ఈ వస్తువుల సరఫరాను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాయి. ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆహార కార్యదర్శులు, ఇతర కీలక వాటాదారులతో సమావేశాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. నిత్యావసరాల ధరలు పెంచడం, నిల్వలను దాచడం వంటివి నివారించడానికి వ్యాపారులు, సరఫరాదారులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో సరిహద్దు జిల్లాల పట్ల కేంద్రం మరింత శ్రద్ధ వహిస్తోంది. ఇందులో భాగంగా చండీగఢ్‌లో నిత్యావసర సరకుల నిల్వపై అధికారులు నిషేధం విధించారు. వ్యాపారులందరూ తమ వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని మూడు రోజుల్లోపు ఆహార, సరఫరాల శాఖకు తెలియజేయాలి ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఉద్రిక్తతలు నెలకొంటున్న సమయంలో ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు, సంస్థలు పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అందుబాటులో తగినంత నిత్యావసర వస్తువుల నిల్వలు : కేంద్రం
May 09, 2025
0
Tags