జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి జరుగుతోందంటూ వచ్చిన సోషల్ మీడియా పోస్ట్‌పై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. జీఎస్టీ నంబర్‌ను పొందేందుకు తాను 'అవినీతికి' పాల్పడబోతున్నానంటూ ఓ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్‌గా మారిన నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందిచాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. అంతకుముందు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు కూడా కూడా తన స్పందన తెలియజేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి వినోద్ గుప్తా అనే వ్యక్తి లింక్డిన్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన భార్య, కుమార్తె కలిసి నెలకొల్పిన సంస్థకు జీఎస్టీ నంబర్ కోసం తాను దరఖాస్తు చేశానని, 20 రోజులు దాటినా నంబర్ రాలేదని ఆరోపించారు. అభ్యంతరాలు వస్తున్నా జీఎస్టీ నంబర్ రాలేదని తెలిపారు. జీఎస్టీ నంబర్ పొందడం కోసం తాను లంచం ఇవ్వనున్నట్టు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ట్యాక్స్ నిపుణులు అభిషేక్ రాజారామ్ ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వినోద్ గుప్తా పోస్ట్ స్క్రీన్ షాట్‌ను కోట్ చేస్తూ.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి గురించి సీబీఐసీకి తెలీడం లేదని పేర్కొన్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగులే జోక్యం చేసుకుని దేశంలోని ఈ అవినీతి నుంచి కాపాడాలంటూ పోస్ట్ పెట్టారు. సీబీఐసీని ట్యాగ్ చేశారు. దీంతో పరోక్ష పన్నుల బోర్డు సత్వరమే స్పందించి వివరణ ఇచ్చింది. గుప్తా దరఖాస్తు మే 26న ఫైల్ చేశారని, ఇది దిల్లీ స్టేట్ జీఎస్టీకి అసైన్ చేశారని పేర్కొంది. అయితే రెంట్ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పూర్తిగా పేర్కొనకపోవడంతో దరఖాస్తు పెండింగ్‌లో ఉందని తెలిపింది. ఇదే విషయాన్ని దరఖాస్తుదారుకు కూడా తెలియజేశామని వెల్లడించింది. పెండింగ్ వివరాలు అందితే సంబంధిత అధికారులు ప్రక్రియను పూర్తి చేస్తారని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికింది. ఈ పోస్ట్‌పై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పన్ను చెల్లింపుదారులకు సేవలందించడంతో పాటు వారిని నమ్మకాన్ని చూరగొనడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు తక్షణమే స్పందించాలని సూచించారు.
జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో అవినీతి - లింక్డిన్ పోస్ట్‌పై స్పందించిన నిర్మలా సీతారామన్
May 31, 2025
0
Tags