కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖీలో మాట్లాడారు. యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో పలువురు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో విద్యాపరమైన సమస్యలపై ఆయన చర్చించారు. విద్యార్థులు అన్నింటా ప్రాతినిధ్యం, సమానత్వం, విద్యాపరమైన న్యాయం వంటి పలు అంశాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్షనేత సూచించారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో విద్యార్థులు హాజరై తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల భాగస్వామ్యం, సమ్మిళిత విద్యాసంస్థల ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. అధ్యాపక పదవుల్లో బడుగు వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడంపై ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత పదవుల నియామకాలల్లో కూడా తమ వర్గాలపై చిన్నచూపు ఉందని వారు కాంగ్రెస్ నేతకు తెలిపారు. జాతీయ విద్యా విధానం కింద నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో కూడా అసమానతలు ఉన్నాయన్నారు. విద్యాపరంగా తమకు సరైన వసతులు కల్పించడం లేదని, గైర్హాజరు స్థితిగతులపై మార్కింగ్ చేపట్టకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ ''విద్యార్థులు డా. బీఆర్ అంబేద్కర్ సందేశాన్ని తప్పకుండా ఆచరించాలి. విద్యార్థులు ''చదవాలి, నిలదీయాలి, వ్యవస్థీకరించాలి''. న్యాయమైన, సమగ్ర విద్యా పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో స్టూడెంట్స్ కీలక పాత్ర పోషించాలి. విద్యార్థుల పాత్ర తరగతి గదులకు బయట కూడా ఉండాలి. అణచివేతకు గురైన, ప్రాతినిధ్యం తక్కువైన చోట హక్కుల కోసం పోరాడాలి'' అని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.
విద్యార్థులు చదవాలి, నిలదీయాలి, వ్యవస్థీకరించాలి : రాహుల్ గాంధీ
May 22, 2025
0
Tags