ఇజ్రాయెల్‌లోని జెరూసలెం శివారు అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వేలాది మంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులతో ఈ మంటలు వేగంగా చెలరేగుతున్నాయి. మంటలకు సంబంధించిన వీడియోలు, రోడ్లపై పలువురు తమ వాహనాలు విడిచి పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెరూసలెం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు. ఈ మంటలు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రహదారిని మూసేశారు. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాలలోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.
జెరూసలెం శివారు అడవుల్లో కార్చిచ్చు !
May 01, 2025
0
Tags