దేశీయ మార్కెట్లోకి టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ స్కూటర్ వస్తోంది. ఇప్పటికే బజాజ్ సీఎన్జీ బైక్‌ను విడుదల చేయగా, ఇప్పుడు టీవీఎస్ స్కూటర్ల విభాగంలోకి సీఎన్జీ టెక్నాలజీని తీసుకురాబోతోంది. టూవీలర్ కంపెనీలు ఇప్పుడు ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ వాహనాలను విడుదల చేయడం మొదలుపెట్టాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ అనే పేరుతో బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ ప్రస్తుతం అమ్ముడవుతోంది. ఇదే వరుసలో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ స్కూటర్ అనే ఘనతతో టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ అతి త్వరలో మార్కెట్‌లోకి రాబోతోంది. కొన్ని నెలల క్రితం జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో ఈ స్కూటర్‌ను ప్రదర్శించారు. డిజైన్ పరంగా చూస్తే ఇది పెట్రోల్‌తో నడిచే టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ లాగే ఉంటుంది. అయితే, కొన్ని చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ ఛార్జర్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటివి ముఖ్యమైన ఫీచర్లుగా వున్నాయి. ఈ స్కూటర్‌లో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని పవర్ అవుట్‌పుట్ 7.2 హెచ్‌పి, 9.4 ఎన్ఎమ్ టార్క్ ఉంటుందని సమాచారం. అయితే, పెట్రోల్‌తో నడిచే టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ పవర్ అవుట్‌పుట్ 8.1 బీహెచ్‌పి, 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉంది. అంటే, పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే, టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ స్కూటర్ పవర్ అవుట్‌పుట్ కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే, సీటు కింద వస్తువులు పెట్టుకోవడానికి స్థలం ఉండదు. పెట్రోల్‌తో నడిచే టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్‌లో 33 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. కానీ టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ స్కూటర్ సీటు కింద సీఎన్జీ సిలిండర్ ఉంటుంది. కాబట్టి సీటు కింద వస్తువులు పెట్టుకోలేరు. పవర్ అవుట్‌పుట్, బూట్ స్పేస్‌లో కొంచెం రాజీ పడాల్సి వచ్చినా అద్భుతమైన మైలేజ్ ఆ లోపాలను పూడ్చేస్తుందని ఆశిస్తున్నారు. ఈ స్కూటర్ మైలేజ్ ఒక కిలో సీఎన్జీ కి సుమారు 84 కిలోమీటర్లు ఉంటుందని సమాచారం. దీనికి 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది, మొత్తం కలిపి 226 కి.మీ. రేంజ్ వస్తుంది.
త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ స్కూటర్ ?
May 26, 2025
0
Tags