అమెరికా-చైనా మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న వాణిజ్య యుద్ధం భారత్‌కు మంచి అవకాశాలు సృష్టిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తలపడినప్పుడు వాణిజ్యంలో కొంత అస్థిరత ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో భారత్ సరైన నిర్ణయాలు తీసుకొంటే లబ్ధి పొందుతుందన్నారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో భారత్ చురుగ్గా వ్యవహరించి పెట్టుబడులు పెరిగేలా, ఎగుమతులకు ప్రోత్సాహం లభించేలా అమెరికాతో వాణిజ్య చర్చలు జరపాలన్నారు. ట్రంప్ నిర్ణయాలు స్వల్పకాలానికి అమెరికాకు సెల్ఫ్‌గోల్‌లా పనిచేస్తాయని రాజన్ హెచ్చరించారు. ఆ దేశంలో నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి, ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించేందుకు సౌకర్యవంతంగా ఉన్న సమయంలో సొంత ఆర్థిక వ్యవస్థనే ఆయన పట్టాలు తప్పిస్తున్నారన్నారు. అమెరికాకు ఎగుమతులు చేయడంపై ఆధారపడిన వియత్నాం వంటి దేశాలు ఈ నిర్ణయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. వీటితో పోలిస్తే భారత్‌పై టారిఫ్‌ల ప్రభావం పరిమితిగా ఉంటుందని చెప్పారు. మన జీడీపీతో పోలిస్తే ఎగుమతులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని రాజన్ అభిప్రాయపడ్డారు. మన వృద్ధిరేటు పైనా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదన్నారు. భారత్ ఇప్పుడు ఒక్క అమెరికాపైనే కాకుండా .. టారిఫ్‌ల విధానాన్నే పూర్తిగా సరళీకరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. భారత్ ఇప్పుడు ఆర్థిక రక్షణాత్మక వైఖరి నుంచి దూరంగా జరిగి.. వాణిజ్య, పెట్టుబడుల వాతావరణాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. తూర్పు, ఉత్తర దేశాలతోపాటు ఆర్సీఈపీ, ఆసియాన్ వంటి గ్రూపులు, చైనా, జపాన్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలన్నారు. బీజింగ్‌తో న్యూఢిల్లీ వాణిజ్య లోటు ఉన్నా బ్యాలెన్స్‌గా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ట్రంప్ టారిఫ్‌ల దెబ్బను తప్పించుకోవడానికి చైనా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకొన్న కంపెనీలకు భారత్ ఓ ఆకర్షణీయమైన ప్రదేశమని రాజన్ వెల్లడించారు. మనం సరైన నిర్ణయాలు తీసుకొంటే.. అమెరికా తక్కువ టారిఫ్‌లు విధించిన దేశాల్లో భారత్ ఉండటం, దేశీయంగా ఉన్న బలమైన మార్కెట్ వంటి భారీగా పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించే నిర్ణయాలు తీసుకోవడంతోపాటు.. పన్ను చట్టాలను మరింత సరళీకరించాలి. భారత్‌కు సేవారంగ ఎగుమతులకు మాత్రం టారిఫ్‌ల సెగ తాకలేదని చెప్పాలని రాజన్ వివరించారు. ఇటీవల కాలంలో దేశంలో సేవారంగ ఎగుమతులు తయారీ రంగాన్ని దాటేశాయన్నారు. ఇక అమెరికా టారిఫ్‌లు భారత్‌లో ద్రవ్యోల్బణ నియంత్రణకు కూడా ఉపయోగపడే అవకాశాలున్నాయని చెప్పారు. భారత ఎగుమతులు తూర్పు ఆసియా వంటి మార్కెట్ల వైపు చూస్తాయని.. అదే సమయంలో దేశీయ మార్కెట్లు కూడా వాటిని ఆకర్షిస్తాయని చెప్పారు. ఇక చైనా ఉత్పత్తులకు అమెరికాలో ప్రవేశం కష్టం కావడంతో.. భారత్ వైపు మళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇక టారిఫ్‌లు ఇలానే కొనసాగితే మాత్రం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందని రాజన్ అంచనా వేశారు. ఈ పరిస్థితులను అవకాశాలుగా భావించి భారత్ నిర్ణయం తీసుకోవాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా దేశీయంగా సంస్కరణలను చేపట్టాలని చెప్పారు.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం భారత్‌కు మంచి అవకాశాలు సృష్టిస్తుంది : రఘురామ్ రాజన్
April 09, 2025
0
Tags