కడుపుతో ఉన్న భార్యపై సిమెంట్‌ ఇటుకతో దాడి చేసిన భర్త !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కడుపుతో ఉన్న భార్యను నడిరోడ్డుపై సిమెంట్‌ ఇటుకతో విచక్షణారహితంగా దాడి చేశాడో భర్త. తీవ్రగాయాలపాలైన ఆమె ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన  జరిగింది. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం హఫీజ్‌పేట ఆదిత్యనగర్‌లో ఉంటున్న మహ్మద్‌ బస్‌రత్‌ (32) ఇంటీరియర్‌ పనులు చేస్తుంటాడు. 2023 జనవరిలో అజ్‌మేర్‌ దర్గాకు వెళ్లాడు. బస్సు ప్రయాణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన షబానా పర్వీన్‌ (22)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2024 అక్టోబర్‌లో కోల్‌కతాకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకొని హఫీజ్‌పేటకు తీసుకొచ్చాడు. వేరు కాపురం పెడదామన్న పర్వీన్‌ ఒత్తిడితో బస్‌రత్‌ తల్లిదండ్రులను కాదని అదే బస్తీలో అద్దెకు ఉంటున్నాడు. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య విభేదాలు మొదలై తరచూ గొడవపడుతున్నారు. ఇటీవల పర్వీన్‌ గర్భం దాల్చింది. రెండు నెలల గర్భంతో ఉన్న ఆమెకు వాంతులు అధికమవడంతో మార్చి 29న భర్త ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఏప్రిల్‌ 1న రాత్రి 10 గంటల సమయంలో భార్యను డిశ్ఛార్జి చేయించుకొని బయటకొచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ ఇద్దరు గొడవపడ్డారు. రెచ్చిపోయిన బస్‌రత్‌ భార్యను ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై పడేసి ఇష్టానుసారంగా దాడి చేశాడు. పక్కనే సిమెంట్‌ ఇటుకలు తీసుకొని ఆమె తలపై పలుమార్లు బలంగా కొట్టాడు. ఆమె చనిపోయిందనుకుని పారిపోయాడు. పోలీసులు వచ్చి ఆమెను నిమ్స్‌కు తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి 3న రిమాండ్‌కు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)