ఇందిరమ్మ ఇళ్లకు హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ రుణం

Telugu Lo Computer
0

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు పడింది. తొలివిడతలో ఇళ్లు మంజూరై బేస్‌మెంట్‌ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్ధిక సాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇందుకోసం హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రస్తుతానికి ఆ నిధులు హడ్కో దగ్గరేఉన్నాయి. బేస్‌మెంట్‌ వరకు నిర్మించిన ఇళ్ల వివరాలన్నీ కార్పొరేషన్‌కు చేరాక హడ్కో నుంచి నిధులను తీసుకుని లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ ప్రతిష్టాత్మక పథకం కావడంతో.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొందరికి చెక్కులు ఇవ్వాలని, మిగతా వారికి ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి దశ కింద రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా బేస్‌మెంట్‌ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫొటోలు తీసి, జియో ట్యాగింగ్‌ చేస్తూ ఆన్‌ లైన్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వరకు 1,265 ఇళ్ల వివరాలను అప్‌లోడ్‌ చేశారు. బేస్‌మెంట్‌ దశ వరకు కూడా ఇళ్లను నిర్మించుకోలేని పలువురు లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పించింది. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరులో కొందరు లబ్ధిదారులకు రుణం కింద రూ.లక్ష అందించారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలా రుణాలు అందేలా చూడాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్‌ పంపారు. ఇటీవల జరిగిన అడిషనల్‌ కలెక్టర్ల సమావేశంలోనూ దీనిపై సూచన చేశారు. సెర్ప్‌ సీఈవోకు కూడా ఈ రుణాల విషయంలో సహకరించాలంటూ లేఖ పంపారు. బేస్‌మెంట్‌ పూర్తయ్యాక అందించే ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారుల ఆమోదంతో ఎస్‌హెచ్‌జీలకు తిరిగి చెల్లించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేసే అంశంపై చిక్కుముడులు వీడుతున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్రం అమలుచేసే పీఎంఏవై పథకానికి అనుసంధానం చేసి, నిధులు పొందాలని భావించింది. పీఎంఏవైతో రాష్ట్ర పథకాన్ని అనుసంధానించాలంటే.. కేంద్రం రూపొందించిన ఆవాస్‌ ఫ్లస్‌ యాప్‌తో సర్వే చేసి, లబ్ధిదారుల వివరాలను పొందుపర్చాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూపొందించిన యాప్‌తో సర్వే చేసి, లబ్ధిదారులను ఎంపిక చేసింది. దీనితో ఇళ్లు మంజూరు చేయడానికి కేంద్రం అంగీకరించలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపినా ఇటీవలి వరకు స్పష్టత రాలేదు. తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్‌.. రాష్ట్ర హౌసింగ్‌ కార్పోరేషన్‌తోపాటు పలు శాఖలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎంఏవై రూరల్‌ కింద రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. రాష్ట్రం రూపొందించిన యాప్‌, అందులో పొందుపర్చిన దరఖాస్తుదారుల వివరాలు, ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలన్నింటినీ తమకు సమర్పించాలని సూచించినట్టు సమాచారం. మరోవైపు పీఎంఏవై అర్బన్‌ కింద కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి 1.13 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. కేంద్రం రూరల్‌ స్కీం కింద ఇళ్లకు రూ.72 వేలు, అర్బన్‌ స్కీం కింద రూ.1.5లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)