నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను సమూలంగా నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో స్థిరాస్తుల స్వాధీనం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. వార్తాపత్రికకు సంబంధించిన భవనాల్లో కాంగ్రెస్ కార్యాలయాలు నడుస్తుండడంతో వాటిని మూసివేయించాలనే ఉద్దేశంతోనే ఆయా కార్యాలయాలకు నోటీసులు పంపారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా..ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలలో ఉన్న నేతలను దర్యాప్తు సంస్థల పేరుతో తమ పార్టీలో చేర్చుకోవడం భాజపాకు ఏమీ కొత్త కాదని అన్నారు. స్వేచ్ఛ, ఐక్యతతో భారత ప్రజలు ముందుకు సాగాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి స్వాతంత్ర్య సమరయోధులు అప్పట్లో నేషనల్ హెరాల్డ్‌ను స్థాపించారని సిబల్ పేర్కొన్నారు. ఇందుకోసమే వారంతా ఈ వార్తాపత్రికలో వాటాదారులుగా ఉన్నారని అన్నారు. నిబంధనల ప్రకారం.. ఈ ఆస్తిలో లాభం పొందే అర్హత వాటాదారులకు లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా దీనిని సొంతం చేసుకోరని తెలిపారు. భాజపా విజయం సాధించలేని చోట కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగిస్తుందనే విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ విషయంలో ఇదే జరిగిందని..సిద్ధరామయ్యపై కూడా దీనిని ప్రయత్నించారన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా భాజపా అదే విధానాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్' కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి శుక్రవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్న వారు ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్న వారు ఇక నుంచి తమకు ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను గతంలో ప్రచురించిన ఏజేఎల్ సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ.2 వేల కోట్లు ఉంటుందని, ఈ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా సోనియా, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు కేవలం రూ.50 లక్షలకే అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోంది !
April 13, 2025
0
Tags