ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు - డ్రాగన్‌లా అభివృద్ధి చెందాలి : జిన్‌పింగ్‌

Telugu Lo Computer
0


భారత్‌- చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరుదేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పరస్పర అభినందన సందేశాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఏనుగు- డ్రాగన్‌లా అభివృద్ధి చెందాలని అన్నారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య తీవ్ర ఘర్షణతో ఇరు దేశాల మధ్య స్తంభించిన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. పొరుగు దేశాలు శాంతియుతంగా ఉండేందుకు మార్గాలను అన్వేషించాలన్న జిన్‌పింగ్‌ కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాల్లో సంప్రదింపులు, సమన్వయాన్ని మరింతగా పెంచుకొనేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని సంయుక్తంగా కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్‌- చైనా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి నేటికి 75 ఏళ్లు అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. చైనా అధ్యక్షుడు, ప్రధాని.. భారత రాష్ట్రపతి, ప్రధానిలతో అభినందన సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. రెండు దేశాలూ పురాతన నాగరికతలు కలిగి ఉన్నాయని, ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నారు. గ్లోబల్‌ సౌత్‌లో ముఖ్యమైన సభ్యులైన ఇరు దేశాలూ ఆధునికీకరణలో కీలక దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)