అమెరికా వాహనాలపై 25 శాతం సుంకాలను విధించినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్ని ట్విటర్‌లో ప్రకటించారు. వాషింగ్టన్ విధించిన సుంకాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు. కెనడా-యునైటెడ్‌స్టేట్స్-మెక్సికో ఒప్పందం పరిధిలోకి రాని వాహనాలన్నింటిపై ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కార్నీ పేర్కొన్నారు. ''ట్రంప్ ఈ వాణిజ్య సంక్షోభానికి కారకులు. కెనడా కేవలం ఓ లక్ష్యం కోసం శక్తిమంతంగా స్పందించింది'' అని వెల్లడించారు. కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ మాట్లాడుతూ ''అకారణంగా అమెరికా విధించిన సుంకాలపై కెనడా శక్తిమేరకు స్పందిస్తూనే ఉంటుంది. ఈ సుంకాలను తొలగింపజేసి.. కెనడా ఉద్యోగులు, వాణిజ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'' అని పేర్కొన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు టారిఫ్‌ల విధింపుతో ఇవి తార స్థాయికి చేరాయి. మార్చి 4వ తేదీన కెనడా వస్తువుల దిగుమతిపై ట్రంప్ 25శాతం, ఇంధనం, పొటాష్‌పై 10శాతం టారిఫ్ విధించారు. ఆ తర్వాత సీయూఎస్‌ఎంఏ పరిధిలోకి రాని వాటికి మాత్రమే దీనిని పరిమితం చేశారు. ఆ తర్వాత మార్చి 12న కెనడా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించారు. ఏప్రిల్ 3వ తేదీన కెనడా నుంచి దిగుమతి అయ్యే వాహనాలపై, మే 3 నుంచి విడిభాగాలపై 25శాతం చొప్పున పన్ను వేశారు. కెనడా కూడా వీటిని తగినట్లు స్పందిస్తూ అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు విధించింది.
అమెరికా వాహనాలపై 25 శాతం సుంకాలు విధించిన కెనడా !
April 09, 2025
0
Tags