ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా కొటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అగ్నిప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికీ రూ.15లక్షలు చొప్పున ఆయా కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. అగ్నిప్రమాదం ఘటన గురించి తెలుసుకున్న హోంమంత్రి అనిత హుటాహుటిన అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. అనకాపల్లి అగ్నిప్రమాదంపై స్థానికులు, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారన్నారు. ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ ఆరా తీశారన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇచ్చేదని.. సీఎం చంద్రబాబు మానవతా దృక్పథంతో ఇచ్చిన ఆదేశాలతో రూ.15 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు అనిత వెల్లడించారు.
అనకాపల్లి బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం
April 13, 2025
0
Tags