ఆంధ్రప్రదేశ్ లో మద్యం ద్వారా గత ఆర్దిక సంవత్సరంలో 14 శాతం ఆదాయం పెరుగుదల నమోదు అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రాండెడ్ మద్యంతో పాటుగా రూ 99 కే క్వార్టర్ అమ్మకాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో, అనూహ్యంగా ఆదాయం పెరిగింది. మద్యం పాలసీలోనూ మార్పులు తెచ్చారు. అయతే, ఇప్పుడు రూ 99 క్వార్టర్ మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ శాఖ కొన్ని మార్పులు ప్రతిపాదించింది. అదే సమయంలో కొత్త బార్ల పాలసీ పైన కసరత్తు జరుగుతోంది. ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం 2023-24 లో మద్యంపై రూ.25,082 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 14 శాతం పెరిగి రూ.28,842 కోట్లకు ఆదాయం చేరింది. గత ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యం తిరిగి అందుబాటులోకి వచ్చింది. మద్యం దుకాణాలు టెండర్ల విధానంలో కేటాయించారు. జాతీయ కంపెనీలు తయారు చేసే క్వార్టర్ రూ.99 బ్రాండ్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యల వల్ల పిచ్చి బ్రాండ్లు కనుమరుగవడంతో పాటు భారీగా ఆదాయం సమకూరింది. 2024-25లో సీసాలు పరంగా చూస్తే అమ్మకాలు 9.1 శాతం పెరిగాయి. 2023-24లో 4.55 కోట్ల కేసుల మద్యం అమ్మితే, 2024-25లో 4.97 కోట్ల కేసుల మద్యం అమ్మారు. లిక్కర్‌లో 7.38 శాతం, బీరులో 14.13 శాతం అమ్మకాలు పెరిగాయి. మద్యంపై వచ్చే పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు కాగా, షాపులు, బార్లు, డిస్టిలరీల లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.2,206 కోట్లుగా ఉంది. షాపుల దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు వచ్చింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ 99 కే మద్యం అందుబాటు లోకి తెచ్చింది. 12 కంపెనీలు ఈ రకం మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. క్వార్టర్ రూ.99 అమ్మకా లు ప్రారంభించిన సమయంలో అమ్మకాల్లో వాటి వాటా 30 శాతానికి చేరింది. తక్కువ ధరలో లభిస్తున్న క్వార్టర్ రూ.99కు డిమాండ్ పెరిగింది. అయితే వీటి అమ్మకాలు పెరుగుతున్నా విలువ తగ్గుతోందని చెబుతున్నారు.. అమ్మకాలకు తగినట్టుగా ఆ మేరకు ఆదాయం రావడం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో ఈ బ్రాండ్ల మద్యాన్ని కొంతమేర నియంత్రించేలా చర్యలు మొదలు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ద్వారా 14 శాతం ఆదాయం పెరుగుదల !
April 18, 2025
0
Tags