రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ముగింపు చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల పాటు దాడులు నిలిపివేసేలా యూఎస్, మాస్కోల మధ్య అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. తమ అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ఆదేశాలను సాయుధ దళాలు పాటిస్తున్నాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. అగ్రరాజ్యానికి మాస్కోకు జరిగిన ఒప్పందం ఉల్లంఘనకు గురైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. తమ భూభాగంలోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేసినట్లు ఆయన పేర్కొనడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఓ రష్యన్ ఇంధన కేంద్రం రాత్రి సమయంలో దగ్ధమయ్యిందని ఆయన పేర్కొన్నారు. దీనిని చూపించి కీవ్‌లోని ఇంధన వనరులపై దాడులు చేస్తున్నామని జెలెన్‌స్కీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారి మాటలను ఎంత వరకు నమ్మవచ్చో దీనిద్వారా తెలుసుకోవాలని ప్రపంచ దేశాలను కోరారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్‌లో జరిపిన చర్చల్లో భాగంగా వారు పలు నిర్ణయాలు తీసుకున్నారు. మూడేళ్లకుపైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెలరోజులపాటు దాడులు నిలిపివేసేలా చూడాలని అమెరికా, రష్యా ఒప్పందం చేసుకున్నాయి. ముందుగా ఈ రెండు రంగాల వరకు దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు. దీనికి పుతిన్ అంగీకరించారని, శాంతి దిశగా ఇది తొలిఅడుగు అని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. నల్ల సముద్రంలో దాడుల విరమణకు, ఆ తర్వాత పూర్తిగా యుద్ధం అంతానికి ఇది దారితీస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.
ఉక్రెయిన్ ఇంధన వనరులపై మేము దాడులు చేయట్లేదు !
March 21, 2025
0
Tags