కర్ణాటక అసెంబ్లీలో సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప వింత ప్రతిపాదనను తీసుకొచ్చారు. పురుషులకు వారానికి రెండు బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచారని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. కానీ దీని కోసం ప్రభుత్వం మళ్లీ పన్నులు పెంచాల్సి ఉంటుందని, దీని కోసం తాను కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నానని వాటికి అభ్యంతరం చెప్పకండి అంటూ జేడీఎస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. మద్యం మీద వచ్చే ఆదాయంతో మహిళలకు నెలకు రూ.2000, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారని ఎంటీ కృష్ణప్ప వెల్లడించారు. కాబట్టి మద్యం తాగేవారికి ప్రతివారం రెండు మద్యం బాటిళ్లను ఉచితంగా ఇవ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా సూచించారు. వాళ్లను తాగనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. కనీసం ప్రభుత్వం పురుషుల కోసం కూడా ఏదైనా చేయాలి అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీనిని వ్యతిరేకిస్తూ మంత్రి కేజే జార్జ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దీనిని అమలు చేయాలని అన్నారు. ప్రజలు తక్కువ మద్యం తాగేలా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. మంత్రి ప్రకటనను స్పీకర్ సమర్థించారు. రెండు సీసాలు ఇవ్వకుండా ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అదే రెండు మద్యం సీసాలు ఉచితంగా ఇస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చన్నారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ పాటిల్ అన్నారు. కేంద్రమే దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలని సూచించారు. జేడీఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదనపై మహిళా శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
మగాళ్లకు వారానికి రెండు మద్యం బాటిళ్లను ఫ్రీగా ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప
March 20, 2025
0
Tags