సుప్రీం కోర్టు భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయ్యిందని, పోలీసులు కనీసం ఇప్పుడైనా వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. రెచ్చగొట్టే పాటను షేర్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విధంగా స్పందించింది. ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది. గుజరాత్ జామ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ సామూహిక వివాహాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ పాల్గొన్నారు. అనంతరం ఓ పద్యంతో కూడిన వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది. ఆ పాట ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని పేర్కొంటూ జనవరి 3న ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. దీంతో ప్రతాప్‌గఢీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కు పరిరక్షణ ప్రాముఖ్యతను మరోసారి వివరించింది. అది కేవలం పద్యం మాత్రమేనని, అనువాదంలో కొంత సమస్య ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలని పేర్కొంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు అవుతుండగా.. కనీసం ఇప్పటికైనా భావప్రకటనా స్వేచ్ఛ గురించి పోలీసులు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.
పోలీసులు ఇప్పుడైనా భావప్రకటనా స్వేచ్ఛను అర్థం చేసుకోవాలి : సుప్రీంకోర్టు
March 03, 2025
0
Tags