ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల ఈ పర్యటన కోసం ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ వెంటనే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కొందరు ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు. దాదాపుగా గంటకు పైగా అమిత్ షా- చంద్రబాబు మధ్య సమావేశం కొనసాగింది. పలు అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలు, రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు.. వంటి విషయాలపై చర్చలు సాగాయి. రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై అంశం వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారం- రాష్ట్రంలో ఇప్పుడున్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225కు పెరగాల్సి ఉంది. వీటిపై చంద్రబాబు.. అమిత్ షాతో చర్చించారని అంటున్నారు. అలాగే దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ కింద జమిలి ఎన్నికలు జరగాల్సి వస్తే.. అత్యంత సీనియర్ నాయకుడిగా, ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్ష నేతగా ఇతర కూటమి పార్టీలను సమన్వయం చేయాల్సిన బాధ్యతలను బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుకు అప్పగించవచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం నిర్మలా  సీతారామన్‌ను ఆమె నివాసంలో కలుసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)