ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒకే వేదికగా భారత మ్యాచ్‌లు జరగడం ద్వారా ఆ జట్టుకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్‌తో పాటు ఆస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నారు. ఇది అన్యాయమని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ ఘాటుగా బదులిచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే బదులు సొంత జట్టు ప్రదర్శనపై ఫోకస్ పెట్టాలని హితవు పలికాడు. టీమిండియా ద్వారా వచ్చే ఆదాయంతోనే వారికి జీతాలు దక్కుతున్నాయని కూడా అన్నాడు. 'ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సెమీఫైనల్ చేరలేకపోయింది. ఆ బాధను వేరే జట్లపై వెళ్లగక్కడం సరికాదు. ముందుగా ఇంగ్లండ్ జట్టు లోపాలపై దృష్టిసారించండి. ఈ విషయాలను నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ఇంగ్లండ్ సెమీస్ చేరకపోవడానికి గల కారణాలపై సమాలోచనలు చేయండి. అంతేకానీ టీమిండియా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టును గాడిలో పట్టేందుకు అవసరమైన చర్యలను సూచించండి. దేశం కోసం ఆడేటప్పుడు బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. అంతేకానీ, 'భారత్‌కు అలాంటి అవకాశం వచ్చింది. మాకు మాత్రం రాలేదు'అని విచారం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి పొగరు మాటలు మాట్లాడవద్దని గతంలో చెప్పాను. కానీ మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా అందించే సేవలు అద్భుతం. ప్రతిభ పరంగానే కాకుండా అర్థికంగానూ వెన్నదన్నుగా నిలుస్తోంది. టీవీ, మీడియా హక్కుల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. ఇంగ్లండ్ కామెంటేటర్లకు జీతాలు పరోక్షంగా టీమిండియా వల్లనే వస్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.'అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
విమర్శలు మాని ఇంగ్లండ్ సెమీస్ చేరకపోవడానికి గల కారణాలపై ఆలోచించండి : సునీల్ గవాస్కర్
March 01, 2025
0
Tags