అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా చైనా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. ''గాజా ప్రాంతం పాలస్తీనీయులదే. అక్కడినుంచి వారిని బలవంతంగా తరలించేందుకు మేం వ్యతిరేకం'' అని స్పష్టం చేసింది. అలాగే అరబ్ లీగ్ నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. వారిని తరలించడం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. గాజాలో ఉన్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడితే అమెరికా బాధ్యత తీసుకుని గాజాను పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ సందర్భంగా ట్రంప్ చెప్పారు. ''పాలస్తీనియన్లు వేరేచోట స్థిరపడిన తర్వాత గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన ప్రమాదకరమైన బాంబులను, ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను తీసుకుంటుంది'' అని వెల్లడించారు. ''దాడుల వల్ల అక్కడ నామరూపాల్లేకుండా ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తుంది. కాంక్రీటు శిథిలాల కింద అక్కడ ప్రజలు ఉంటున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు లభించేలా చూడవచ్చు'' అని ట్రంప్ పేర్కొన్నారు. పునర్నిర్మాణం తర్వాత పాలస్తీనావాసులతో పాటు యావత్ ప్రపంచ ప్రజలకు దానిని ఇస్తామని, అక్కడ అంతులేని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు నెతన్యాహు కూడా దీనిని ఓ విప్లవాత్మక ఆలోచనగా అభివర్ణించారు. హమాస్ మాత్రం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. ''కొనుగోలు చేసి.. అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదు. అది మా పాలస్తీనాలో విడదీయలేని భాగం'' అని పేర్కొంది. తాజాగా జోర్దాన్ రాజు అబ్దుల్లా 2తో భేటీ అయిన ట్రంప్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. '''మేము గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తాం. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన మాకు లేదు. మధ్యప్రాచ్యంలోని ప్రజలకు అనేక ఉద్యోగాలు సృష్టించనున్నాం'' అని ట్రంప్ ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో తెలిపారు. 2023 అక్టోబర్ నుంచి హమాస్, హెజ్‌బొల్లా వంటి గ్రూపులతో ఇజ్రాయెల్ పోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లోటు ఎదుర్కొంటోంది. దానిని తగ్గించడంతో పాటు యుద్ధ ఖర్చులను భర్తీ చేసేందుకు ఇజ్రాయెల్ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో 5 బిలియన్ డాలర్ల విలువైన ప్రభుత్వ బాండ్లను విక్రయించింది.
గాజా పాలస్తీనీయులదే : చైనా
February 12, 2025
0
Tags