షేక్‌ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తాం !

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హసీనా వ్యాఖ్యలపై ఢాకా ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానిని తమ దేశంలోకి రప్పించడమే తమ అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యమని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం పేర్కొన్నారు. హసీనాను న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సివున్నందున ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను కోరుతున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామన్నారు. బంగ్లాదేశ్‌లోని హసీనా అవామీలీగ్ పార్టీని రాజకీయాల్లో కొనసాగించాలా.. వద్దా అనే విషయాన్ని దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయని అన్నారు. అయితే ఆమె అధికారంలో ఉన్న సమయంలో జరిగిన హత్యలు, అదృశ్యాలు, ఇతర నేరాలకు పాల్పడినవారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతారని అన్నారు. హసీనా దేశ ప్రధానిగా ఉన్న సమయంలో అధికారం చేజారకూడదనే ఉద్దేశంతో నిరసనకారులను హత్య చేసిననట్లు, దాడులు జరిపినట్లు ఐక్యరాజ్యసమితి  పేర్కొన్న నివేదికలను ఆయన ఉదహరించారు. హసీనా ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాన్ని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలని యూఎన్‌ అభివర్ణించిందని తెలిపారు. కాగా ఈ విషయంపై భారత్‌ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇటీవల అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో.. హసీనా జూమ్‌కాల్‌ ద్వారా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తానని అన్నారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. అల్లర్లు ఆగట్లేదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని.. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న దేశం వీడిన షేక్‌ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఈక్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌  ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. హసీనా ప్రభుత్వంలో పనిచేసిన 41 మంది పోలీసు అధికారులను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేసింది. విద్యార్థుల ఆందోళన సమయంలో వారిని అణచివేశారంటూ 1059 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. హసీనాను భారత్‌ బంగ్లాకు అప్పగించకపోవడం వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)