ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమైయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలు తొలగించారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆతిశీ ఆరోపించారు. భాజపా దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని ఆమె అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలు ఏర్పాటు చేశారని అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం ఆఫీస్ నుంచి వారి ఫొటోలను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమావేశానికి ముందు ఆప్ నేతలు అసెంబ్లీ వెలువల ఆందోళనకు దిగారు. భాజపా ప్రభుత్వం తమ మొదటి క్యాబినెట్ సమావేశంలోపు ప్రతి మహిళ ఖాతాలో రూ.2,500 వేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మార్చి 8 నాటికి ఢిల్లీల్లోని ప్రతి మహిళ ఖాతాలో మహిళా సమ్మాన్ యోజన మొదటి విడత డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. గత రెండ్రోజులుగా సీఎంను కలవడానికి తమకు సమయం కూడా ఇవ్వట్లేదని అన్నారు. ప్రతిపక్షాల నిరసనలపై అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన భాజపా ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకు సభ సజావుగా నడవడం ఇష్టం లేదని, సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాలను రాజకీయం చేయొద్దని ఆప్ నేతలను వారించారు. ఈ గందరగోళం మధ్య సభా కార్యక్రమాలు 15 నిమిషాల పాటు వాయిదా పడ్డాయి.
ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల నిరసన
February 24, 2025
0
Tags