తిరుపతి నగర కార్పొరేషన్ లో టీడీపీకి ఏకైక కార్పొరేటర్ గా ఉన్న ఆర్సీ మునికృష్ణ మంగళవారం జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. సంఖ్యాపరంగా తిరుపతి నగర కార్పొరేషన్ లో వైసీపీకి కావాల్సినంత బలం ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 50 డివిజన్ లున్న తిరుపతి కార్పొరేషన్ లో గతంలో 49 డివిజన్లకు ఎన్నికలు జరగగా, 48 వైసీపీ, టీడీపీ ఒక్క కార్పొరేటర్ గెలుచుకున్నాయి. టీడీపీ నుంచి కార్పొరేటర్ గా ఆర్సీ మునికృష్ణ ఒక్కడే ఎన్నికయ్యారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత 22 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు వచ్చేశారు. ఎక్స్ అఫిషీయో మెంబర్లు టీడీపీ కి మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉంటే వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి కి మద్దతుగా ఎంపీ గురుమూర్తి ఉన్నారు. దీంతో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను ఎన్నికకు రాకుండా టీడీపీ నేతలు కావాలనే అడ్డుకున్నారని వైసీపీ ఆరోపించింది. మరో ఎక్స్ అఫీషియో మెంబర్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న కోరం లేదని వాయిదా పడిన ఎన్నికలు, మంగళవారం కావాల్సిన కోరం ఉండటంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. వైసీపీ కార్పొరేటర్ లడ్డూ భాస్కర్ తరపున మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ రాధాకృష్ణ ప్రతిపాదించారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణ తరపున ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేటర్ అన్నై అనిత ప్రతిపాదన చేశారు. మంగళవారం ఉదయం నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 ఓట్లు వచ్చాయి.
తిరుపతి డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ ఎన్నిక !
February 04, 2025
0
Tags